జెల్లీ ఐస్‌క్రీం |
చిక్కనిపాలు - అరలీటరు మొక్కజొన్నపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను జీఎంఎస్ (గ్లిజరిల్ మోనో స్టెరేట్) - ఒకటిన్నర టేబుల్‌స్పూను సీఎంసీ (సోడియం కార్బాక్సీ మిథైల్ సెల్యూలోజ్) - చిటికెడు చక్కెర - ఎనిమిది టేబుల్‌స్పూన్లు పాలపొడి - రెండు టేబుల్‌స్పూన్లు తాజా క్రీం - అరకప్పు స్ట్రాబెర్రీ ఎసెన్స్ - చెంచా పింక్ ఫుడ్‌కలర్ - చిటికెడు స్ట్రాబెర్రీ క్రష్ - పావుకప్పు జెల్లీలు - పావుకప్పు
ఓ గిన్నెలో పాలను తీసుకుని బాగా మరిగించి అందులోంచి కప్పు పాలు విడిగా తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన పాలల్లో చక్కెర వేసేయాలి. అది కరిగేలోగా విడిగా తీసి పెట్టుకున్న పాలల్లో మొక్కజొన్న పిండీ, జీఎంఎస్, సీఎంసీ, పాలపొడి వేసి ఉండలు లేకుండా మెత్తగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మరుగుతోన్న పాలల్లో వేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కబడుతుంది. అప్పుడు పొయ్యికట్టేసి చల్లారనిచ్చి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఎనిమిది గంటల తరవాత ఐస్‌క్రీంను బయటకు తీసి అందులో తాజా క్రీం, స్ట్రాబెర్రీ ఎసెన్స్, ఫుడ్‌కలర్, స్ట్రాబెర్రీ క్రష్ వేసుకుని బీటర్‌తో పావుగంట పాటు గిలకొట్టినట్లు చేయాలి. అప్పుడు ఐస్‌క్రీం రెట్టింపు అవుతుంది.
అందులో జెల్లీలు కూడా కలిపి మరోసారి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎనిమిది గంటలయ్యాక బయటకు తీసి తినొచ్చు. ఐస్‌క్రీం మధ్యలో జెల్లీలు వస్తూ చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment